హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణలో రాగల రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. పశ్చిమ విదర్భ, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం దాదాపు పశ్చిమ దిశకు కదిలి అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణశాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 7.6కిలోమీటర్ల వరకు విస్తరించి నైరుతి వైపునకు ఎత్తుకు వంగి ఉందని.. ఇది రాబోయే 24గంటల్లో బలహీనపడుతుందని తెలిపింది. ఆదివారం నుంచి మంగళవారం మధ్య మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర మీదుగా పశ్చిమం వైపు కదులుతూ అక్టోబర్ ఒకటి నాటికి గుజరాత్ తీరం వెంబడి ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబర్ 30న ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. దాని ప్రభావంతో అక్టోబర్ ఒకటిన ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..