అమరావతి, 29 సెప్టెంబర్ (హి.స.) : ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల సమీపంలోని గట్టుపై వజ్రాల అన్వేషణకు వచ్చి కృష్ణానది వరదలో చిక్కుకున్న పలువురిని స్థానికులు ఆదివారం సురక్షితరంగా ఒడ్డుకు చేర్చారు. ఎన్టీఆర్, పల్నాడు, నల్గొండ తదితర జిల్లాల నుంచి మహిళలు, వృద్ధులు, పురుషులు, పిల్లలు వజ్రాల వెతుకులాటకు వచ్చారు. చీకటి పడిన తర్వాత సమీపంలోని ఆలయాలు, చెట్టు నీడన బసచేశారు. ఆదివారం ఉదయం నుంచి కృష్ణానదిలో వరద ప్రవాహం క్రమంగా పెరగడంతో గట్టు చుట్టూ నీరు చేరింది. దీంతో భయాందోళనకు గురైన వారు సమీప ద్వారక వెంకటేశ్వరస్వామి ఆలయంలో తలదాచుకున్నారు. వరదకు కొట్టుకుపోయిన పడవలను వెతకడానికి లక్ష్మీపురం తెదేపా నాయకుడు పూజల వెంకయ్య, స్థానికులు పడవపై నదిలోకి వెళ్లారు. ఆ సమయంలో బిక్కుబిక్కుమంటూ ఆలయంలో ఉన్న సుమారు 50 మందిని గుర్తించి పడవల్లో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ