అమరావతి, 29 సెప్టెంబర్ (హి.స.)దేశీయంగా, అంతర్జాతీయంగా ఇప్పటికే ఖ్యాతి గడించిన అరకు కాఫీ.. అనేక ఘనతలను సొంతం చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఆర్గానిక్ సర్టిఫికేషన్.. పార్లమెంట్ ప్రాంగణంలో స్టాళ్ల ఏర్పాటు.. ప్రధాని మోడీ నుంచి ప్రశంసలు.. తాజాగా ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫార్మేషన్ విభాగంలో ‘ఛేంజ్ ఆఫ్ ద ఇయర్ 2025’ అవార్డును అరకు కాఫీ దక్కించుకుంది. గిరిజనులు సహజ పద్ధతుల్లో సాగు చేస్తున్న అరకు కాఫీ తోటలు ఏపీలో తూర్పు కనుమల్లో ఉన్నప్పటికీ.. ఆ కాఫీ ఘుమఘుమలు మాత్రం ఖండాంతరాలను దాటేశాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో అక్కడి గిరిజనులు కాఫీ పంటలను సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచే మొత్తం ఉత్పత్తి జరుగుతోంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, సాగు చేసే విధానం మన్యం కాఫీకి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. కాగా, హుద్‌హుద్ తుపాను ధాటికి వేల ఎకరాల్లో కాఫీ తోటలు ధ్వంసమయ్యాయి. ఆ తోటలను అప్పటి టీడీపీ ప్రభుత్వం పునరుద్ధరించి కాఫీ రైతులను ఆదుకుంది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు మన్యం కాఫీని అరకు కాఫీగా ప్రాచుర్యంలోకి తీసుకురావడమే కాకుండా తానే స్వయంగా అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం విశేషం. ఆదివారం ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫార్మేషన్ విభాగంలో ‘ఛేంజ్ ఆఫ్ ద ఇయర్ 2025’ అవార్డును అరకు కాఫీ దక్కించుకోవడంతో సీఎం చంద్రబాబు గిరిజన రైతులకు, జీసీసీకి అభినందనలు తెలిపారు. ఇప్పటికీ అవకాశం వచ్చిన ప్రతిసారీ అరకు కాఫీ గురించి సీఎం గొప్పగా పేర్కొనడం గమనార్హం.
అటవీశాఖ 1960లో అరకు, అనంతగిరి, చింతపల్లి, పాడేరు రిజర్వ్ ఫారెస్ట్‌లో కాఫీ తోటల పెంపకం మొదలెట్టింది. తర్వాత అంచెలంచెలుగా సాగును విస్తరిస్తూ వచ్చారు. 2014 వరకు మన్యంలో లక్ష ఎకరాల్లోపే కాఫీ పంటలు సాగవుతుండేవి. ఆ ఏడాది అక్టోబరులో వచ్చిన హుద్‌హుద్ తుపాను తీవ్రతకు వేల ఎకరాల్లో కాఫీ తోటలు ధ్వంసమయ్యాయి. ఆదివాసీ రైతులు కోలుకోలేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూడగా.. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మన్యం రైతులకు అండగా నిలిచి.. పాడైన తోటలను పునరుద్ధరించడమే కాకుండా రూ. 520 కోట్లకు పైగా నిధులతో సమగ్ర తోటల అభివృద్ధి ప్రాజెక్టును తీసుకొచ్చారు. జీసీసీ, ఐటీడీఏ తదితర విభాగాల సమన్వయంతోనే గిరిజనులకు సహాయం అందించారు. అదనంగా మరో 1.5 లక్షల ఎకరాలు సాగు లోకి తెచ్చారు. అలాగే తాము ఉత్పత్తి చేసే పంటలకు మార్కెటింగ్ కోసం పలు స్వచ్ఛంద సంస్థల సహకారం అందించారు. అనాటి నుంచి నేటి వరకు కాఫీ రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారు.
ఆర్గానిక్‌తో అధిక ఆదాయం..
కేంద్ర కాఫీ బోర్డు గణాంకాల ప్రకారం ఉత్పత్తుల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు తర్వాత స్థానంలో ఏపీ ఉంది. తొలి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లో పంట దిగుబడి పెరగాలనే ఉద్దేశంతో ఎరువులు, రసాయనాలు అధికంగా వినియోగిస్తుంటారు. మన రాష్ట్రంలోని మన్యంలో మాత్రం పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే కాఫీ తోటలను ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. ఆపెడా సంస్థ నేతృత్వంలో మన ఉత్పత్తులను పలు సంస్థలు తనిఖీలు చేసి ధ్రువీకరించడంతో అరకు కాఫీ ‘ఆర్గానిక్ సర్టిఫికేషన్’ను సాధించింది. దీంతో ఒకప్పుడు కిలో కాఫీ రూ. 120 నుంచి 260 మధ్య ఉన్న ధర ఈ ఏడాది గరిష్టంగా రూ. 450 కి చేరింది.
కాఫీ.. ప్రపంచ ఖ్యాతి..
ఎనభై దశకానికి ముందు ఉమ్మడి విశాఖ మన్యం రైతులకు మత్తు పంటలే జీవనాధారం. ఆ తర్వాత వచ్చిన మార్పుల కారణంగా తొలుత వందల ఎకరాల్లో మొదలైన కాఫీ సాగు అంచెలంచెలుగా విస్తరిస్తూ నేడు 2.41 లక్షల ఎకరాల్లో రైతులు పండిస్తున్నారు. మన్యం కాఫీ నుంచి అరకు కాఫీ గా ప్రాచుర్యం పొందాక.. కాఫీ ప్రియులు నిర్వహించే అనేక పోటీల్లో అంతర్జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకుని ప్రపంచ ఖ్యాతిని గడించింది. విదేశాలకు అరకు కాఫీ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. కాఫీ తోటల్లో వేసే అంతర పంటలతోపాటు, ఎగుమతులపై వచ్చే ఆదాయం 2 లక్షల మంది ఆదివాసీల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి