చెన్నై,/దిల్లీ: 29 సెప్టెంబర్ (హి.స.): తమిళనాడులోని కరూర్‌లో నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రచారసభలో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే నాయకులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్ఘటనపై విచారణకు నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తెలిపారు. శనివారం అర్ధరాత్రి ఆయన విమానంలో తిరుచ్చి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కరూర్ ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. మృతులకు నివాళులర్పించి క్షతగాత్రులను పరామర్శించారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయబోమని స్పష్టంచేశారు. జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ అందించే నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు. తొక్కిసలాట నెలకొన్న ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిన చెప్పులు, చిరిగిన బ్యానర్లు, నలిగిన పార్టీ కండువాలు మూగసాక్ష్యాలుగా కనిపించాయి. తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య సోమవారానికి 40కి చేరింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ