కర్నూలు , 3 సెప్టెంబర్ (హి.స.)బాదం, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది ఈ ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ జాబితాలో అంజీర్‌లను చేర్చడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఈ అంజీర్ పండ్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించడమే కాకుండా పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటాయి. వాటిలో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. అందుకే అంజీర్‌లను ఏ విధంగానైనా తినవచ్చు. కానీ ఆయుర్వేదం, పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వాటిని రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల నిర్దిష్ట ప్రయోజనాలు లభిస్తాయి. ఎండుద్రాక్షల మాదిరిగానే వీటిని కూడా నీళ్లలో నానబెట్టి తీసుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే మీ ఆరోగ్యంలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ
అంజీర్ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంజీర్ పండ్లలో క్లోరోజెనిక్ ఆమ్లం కూడా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అంతేకాకుండా నానబెట్టిన అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
మలబద్ధకాన్ని తగ్గించడంలో ప్రభావం
అంజీర్ పండ్లలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అంజీర్ పండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మలబద్ధకంతో బాధపడుతున్న రోగులు నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు.
ఈ రోజుల్లో చాలా మంది బరువు పెరగడం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. దీంతో బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్లడం నుంచి డైట్ పాటించడం వరకు వివిధ మార్గాలను ప్రయత్నిస్తున్నారు. కానీ వీటికి బదులుగా ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల ఈ సమస్య సులభంగా పరిష్కరించబడుతుంది.
అంజీర్ పండ్లలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ అంజీర్ పండ్ల వినియోగం ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంజీర్ పండ్లు ఎముకలను బలోపేతం చేయడంలో పాలు మాదిరి ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల ఎముకలు బలపడతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి