జయశంకర్ భూపాలపల్లి, 3 సెప్టెంబర్ (హి.స.)
జయశంకర్ భూపాలపల్లిలో హత్యకు గురైన వర్షిణి (22) హత్య కేసు మిస్టరీ వీడింది. కొద్దిరోజుల క్రితం భూపాలపల్లి- కాటారం హైవే పక్కన అడవిలో యువతి డెడ్ బాడీని వాహనదారులు గమణించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం వద్ద నిమ్మకాయలు, పసుపు కుంకుమ ఉండటంతో నరబలి అని అనుమానించారు. అక్కడ దొరికిన ఆధార్ కార్డ్ ఆధారంగా చనిపోయిన యువతి జిల్లాలోని చిట్యాల మండలం వడితల గ్రామానికి చెందిన వర్షిణిగా గుర్తించారు. ప్రియుడి మోజులో వర్షిణిని ఆమె సవితి తల్లి కవిత ప్రియుడితో కలిసి కూతురును హత్య చేసినట్టు గుర్తించారు. అంతే కాకుండా గతంలో కవిత తన భర్తను హత్య చేసి అనారోగ్యంతో చనిపోయినట్టు అందరినీ నమ్మించినట్టు పోలీసుల విచారణలో తేలింది. కవితకు గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉండగా తన భర్తకు విషయం తెలిసిందని జూన్ 25న అతడిని హత్య చేసింది.
అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడని అందరినీ నమ్మించి తప్పించుకుంది. ఇక ఆమె వివాహేతర సంబంధం గురించి కూతురుకు సైతం తెలియడంతో అతడు ఇంటికి ఎందుకు వస్తున్నాడని వర్షిణి పలుమార్లు వాదించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రియుడి సహాయంతో కూతురును సైతం హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు