న్యూఢిల్లీ, 3 సెప్టెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సమావేశాలు ప్రారంభంకానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం అవుతుంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క, ఏపీ నుంచి పయ్యావుల కేశవ్ పాల్గొననున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, సీబీఈసీ ఛైర్ పర్సన్ హాజరుకానున్నారు.
మొత్తం 33 మంది సభ్యులతో కూడిన ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో జీఎస్టీ స్లాబ్‌లలో భారీ మార్పులు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం జీఎస్టీ స్లాబ్‌లను రద్దు చేసి సంబంధిత ఉత్పత్తులను 5 శాతం, 18 శాతం స్లాబ్‌లోకి మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ