న్యూఢిల్లీ, 3 సెప్టెంబర్ (హి.స.)
యూరియా విషయంలో కేంద్ర
ప్రభుత్వానికి ముందుచూపు లేదని మంత్రి తుమ్మల విమర్శించారు. వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోలేకపోయారని దాంతో దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉందన్నారు. ఆ ప్రభావం తెలంగాణపైనా ఉందని చెప్పారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన తుమ్మల.. ఆగస్టులో రావాల్సిన యూరియా పూర్తిగా రాలేదని, సెప్టెంబర్ లో రావాల్సిన యూరియా ఇంకా రాలేదన్నారు. యూరియా విషయంలో కేంద్ర మంత్రి నడ్డాని పదే పదే విజ్ఞప్తి చేశాం. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేశారు. అయినా వారు చెప్పినంత కూడా సరఫరా నాలుగు నెలలుగా చేయలేకపోయారన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పని చేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు సెప్టెంబర్ చాలా కీలకం అని అన్ని పంటలకు ఈ నెలలోనే యూరియా వేయాల్సి ఉంటుందన్నారు. ఈ నెలాఖరుకల్లా కేంద్రం ఇస్తున్న యూరియా ఇవ్వాలన్నారు. ఈ నెలాఖరుకల్లా 2.8 లక్షల టన్నుల యూరియా కోరుతున్నామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు