అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.)
ఉట్కూరు: ఆడుకుంటూ వెళ్లి ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిగుంతలో పడి మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండాలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మారెడ్డిపల్లి తండాకి చెందిన పునియ నాయక్, జయమ్మ దంపతులకు అభి(5), ఆకాశ్(4) కుమారులున్నారు. గత కొన్నాళ్లుగా వీరు హైదరాబాద్‌లో నివాసముంటూ తమ గ్రామంలో నిర్వహించే గణపతి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. బుధవారం ఉదయం ఇంటి ఆవరణలోని నిర్మాణ పనులు కోసం ఏర్పాటు చేసుకున్న నీటిగుంతలో ప్రమాదవశాత్తు పడిపోయారు. ఎవరూ గమనిచకపోవడంతో గుంతలోనే మృత్యువాత పడ్డారు. కొంత సమయం తర్వాత జయమ్మ పిల్లల కోసం వెతికినా ఆచూకి లభ్యం కాలేదు. ఆ ప్రాంతంలో ఉన్నవారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. చిన్నారులను జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ