అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.)
మహబూబాబాద్ రూరల్, డోర్నకల్, శివ్వంపేట, గంగాధర, ఖానాపురం, యూరియా బస్తాల కోసం రైతుల అవస్థలు తీరడంలేదు. నిల్వలు రావడంతో తమకు దొరుకుతుందో లేదోనన్న ఆందోళనతో వేకువ జామునుంచే బారులు తీరుతున్నారు. మహబూబాబాద్‌కు మంగళవారం 2,300 యూరియా బస్తాలు రావడంతో అధికారులు మహబూబాబాద్, శనిగపురం, అమనగల్, జమాండ్లపల్లి, సిక్రిందాబాద్‌తండాల్లో పంపిణీ చేశారు. శనిగపురం, డోర్నకల్‌లలో టోకెన్ల కోసం భారీ సంఖ్యలో తరలివచ్చారు. నీ మెదక్ జిల్లా శివ్వంపేటలోని సహకార సంఘం వద్దకు మంగళవారం వివిధ గ్రామాల నుంచి వేయి మందికిపైగా రైతులు తరలివచ్చారు. ఒక రైతుకు ఒక్కోటి చొప్పున 850 బస్తాలు పంపిణీ చేశారు. దొరకని వారు నర్సాపూర్-తూప్రాన్ జాతీయ రహదారిపై రెండుసార్లు రాస్తారోకో చేశారు. స్థానిక ఏవో లావణ్య, సహకార సంఘం సీఈవో మధు వారికి నచ్చజెప్పి బుధవారం పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. నీ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలకు యూరియా వస్తోందని మంగళవారం తెల్లవారుజామునే రైతులు తరలివచ్చారు. ఎంతసేపు ఎదురుచూసినా రాకపోవడంతో కరీంనగర్-జగిత్యాల హైవేపై రాస్తారోకో చేశారు. పోలీసులు బలవంతంగా ధర్నా విరమింపజేయగా... మరో గంట తర్వాత కురిక్యాల వంతెనపై మళ్లీ బైఠాయించారు. ఎట్టకేలకు మధ్యాహ్నం యూరియా లారీ రావడంతో 200 మంది రైతులకు రెండు బస్తాల చొప్పున అందజేశారు. వీణవంక, తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లోనూ రైతులు ఆందోళనలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ