న్యూఢిల్లీ, 3 సెప్టెంబర్ (హి.స.) దేశ రాజధాని దిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. యమునా నది పాత రైల్వే వంతెన వద్ద మంగళవారం సాయంత్రానికల్లా నది గరిష్ఠ ప్రమాద స్థాయి అయిన 205.33 మీటర్లు దాటి 206.03 మీటర్ల స్థాయిలో ప్రవహిస్తోంది. వరద పరిస్థితుల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించే ప్రక్రియ ప్రారంభమైంది. భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయం అయ్యాయి. హరియాణాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి లక్షా 76వేల క్యూసెక్కులు, వజీరాబాద్ బ్యారేజి నుంచి 69.21 వేల క్యూసెక్కులు, ఓఖ్లా బ్యారేజీ నుంచి 73.619 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో యమునా నదిలో ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇళ్లలోకి నీరు చేరుతుండడంతో పడవలపై తిరుగుతూ అధికారులు నది తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ