న్యూఢిల్లీ, 3 సెప్టెంబర్ (హి.స.): క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని ఓ అధ్యయనం పేర్కొంది. 2015-19 మధ్య ఆయిజోల్, ఈస్ట్ ఖాసీ హిల్స్, పపుంపరే, కామరూప్ అర్బన్‌తో పాటు మిజోరం రాష్ట్రంలో ఎక్కువ మంది ఈ మహమ్మారి బారిన పడ్డారని పేర్కొంది. దేశవ్యాప్తంగా 43 జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీ (పీబీసీఆర్)లను విశ్లేషించి ఈ అధ్యయనాన్ని రూపొందించారు. ఆ వివరాల ప్రకారం 2015-19 మధ్య 7.08 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు కాగా 2.06 లక్షల మరణాలు సంభవించాయి. మహిళలు ఎక్కువ మంది ఈ జీవనశైలి వ్యాధి బారిన పడుతుండగా.. మరణించే వారిలో పురుషులు ఎక్కువగా ఉండటం గమనార్హం. క్యాన్సర్‌తో బాధపడేవారిలో 51.1 శాతం మహిళలు కాగా చనిపోయేవారిలో వీరి సంఖ్య 45 శాతంగా ఉంది. అదే మొత్తం క్యాన్సర్ బాధితుల్లో పురుషుల వాటా 48.9 శాతం కాగా మరణాల సంఖ్య 55 శాతంగా ఉంది. భారత్‌లో ఒక వ్యక్తికి మొత్తం జీవిత కాలంలో క్యాన్సర్ రావడానికి 11 శాతం సంభావ్యత ఉన్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. అదే మిజోరంలో అయితే ఈ సంభావ్యత పురుషులకు 21.1 శాతంగా, మహిళలకు 18.9 శాతంగా ఉంది. విశాఖపట్నం, బెంగళూరు, మలబార్, కొల్లం, తిరువనంతపురం, చెన్నై, దిల్లీ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడుతున్నారని వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ