న్యూఢిల్లీ, 3 సెప్టెంబర్ (హి.స.)దేశ రాజధాని దిల్లీలోని రెండు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని పేర్కొంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేడాకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసు ఇచ్చింది. ఆయనే స్వయంగా రెండు చోట్ల పేర్లు నమోదు చేసుకున్నారని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ మంగళవారం కొత్త దిల్లీ జిల్లా ఎన్నికల అధికారి ఈ నోటీసు ఇచ్చారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నోటీసులోని వివరాల ప్రకారం.. కొత్త దిల్లీ, జంగ్‌పుర అసెంబ్లీ నియోజకవర్గాల్లో పవన్ ఖేడా ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారు. ‘మీకు తెలిసే ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటరుగా ఉంటే 1950 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం కింద శిక్షార్హమైన నేరమవుతుంది. అందువల్ల మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు’ అని నోటీసులో ఈసీ పేర్కొంది. ఓట్ల చోరీపై గళమెత్తుతున్న ప్రతిపక్ష సభ్యులపై ఈసీ వేధింపులకు ఇది మరో ఉదాహరణని పవన్ ఖేడా వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ