చెన్నై, 3 సెప్టెంబర్ (హి.స.): రద్దీ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు మాస్క్ ధరించాలని ఆరోగ్యశాఖ సూచించింది. వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పగలు ఎండ తీవ్రత, రాత్రి వేళల్లో వర్షం కురుస్తోంది. ఈ కారణంగా చెన్నై సహా పలు జిల్లాల్లో వైరల్ జ్వరాల(Viral Fevers) వ్యాప్తి అధికంగా ఉంది. నగరంలో కూడా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య అధికమవుతోంది. ఈ క్రమంలో, ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో... వాతావరణ మార్పుల కారణంగా వైరల్ జ్వరాలు వ్యాపిస్తున్నాయని,
జ్వరాలు నిరోధించేలా ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించింది. వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు రద్దీ ప్రాంతాలకు వెళ్లొద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించాలని పేర్కొంది. జ్వర లక్షణాలున్న వారు అలసత్వం చూపకుండా సత్వరం ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ