పట్నా,దిల్లీ: 30 సెప్టెంబర్ (హి.స.) సెప్టెంబరు 29: రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సోమవారం తన ఆదాయ వివరాలను ఓ బహిరంగ సభలో వెల్లడించారు. ఇతరుల మాదిరిగా తాను దొంగను కానని, ఆదాయ వ్యయాలను స్పష్టంగా అందరికీ చెప్పగలనని అన్నారు. సలహాలు ఇచ్చి కోట్లు గడించానని చెప్పారు. రెండు గంటలపాటు సలహాలు ఇచ్చినందుకు రూ.11 కోట్లు ఫీజుగా తీసుకున్నానని తెలిపారు. రాజకీయాల్లోకి రాకముందు రాజకీయ పార్టీలకు, సంస్థలకు, కంపెనీలకు సలహాలు ఇచ్చినా ఎలాంటి ఫీజులు తీసుకోలేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక మాత్రం సలహాలు ఇవ్వడం ద్వారా సంపాదన మొదలుపెట్టానని, ఇది సమాజం కోసమేనన్నారు. ‘‘వ్యక్తులకు, కంపెనీలకు సలహాలు ఇవ్వడం ద్వారా గత మూడేళ్లలో రూ.241 కోట్లు సంపాదించా. ఇందులో 18 శాతం అంటే రూ.30.98 కోట్లు జీఎస్టీ చెల్లించా. రూ.20 కోట్లు ఆదాయపు పన్నుగా కట్టాను. రూ.98.95 కోట్లు జన్ సురాజ్ పార్టీకి విరాళంగా ఇచ్చా. ఒక కంపెనీకి రెండు గంటల పాటు సలహా ఇచ్చినందుకు రూ.11 కోట్లు తీసుకున్నా. ఇదీ బిహార్ కుర్రాడి శక్తి. మేం దొంగలం కాము’’ అని వివరించారు. చెల్లింపులు చెక్కుల రూపంలో జరిగాయని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ