హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)
ఇటీవల కేంద్ర ప్రభుత్వ సైబర్ నేరాలను తగ్గించడానికి అనేక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా.. టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) తీసుకువచ్చిన పౌర-కేంద్రిత డిజిటల్ భద్రతా కార్యక్రమం సంచార్-సాథి పెద్ద మైలురాయిని దాటింది. ఇందులోని 'Block Your Lost/Stolen Mobile' సౌకర్యం ద్వారా ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు తిరిగి పొందబడ్డాయి. ఈ సౌకర్యం ద్వారా పౌరులు తమ కోల్పోయిన/దొంగిలించబడిన ఫోన్లను దేశంలోని అన్ని టెలికాం నెట్వర్క్లో బ్లాక్ చేయవచ్చు, ట్రేస్ చేయవచ్చు, అవసరమైతే అన్లాక్ కూడా చేసుకోవచ్చు. ఫోన్లో కొత్త సిమ్ వాడిన వెంటనే, ఆటోమేటిక్గా ట్రేస్ సమాచారం జనరేట్ అవుతుంది. అదే సమయంలో పౌరులకు SMS వస్తుంది. అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్కు కూడా అలర్ట్ పంపబడుతుంది. దీంతో ఫోన్లు తిరిగి దొరకడం సులభం అవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో ప్రజల డిజిటల్ ఆస్తుల భద్రతను బలపరుస్తూ, సైబర్ నేరాలపై పోరాటంలో టెక్నాలజీ శక్తిని చూపిస్తోందని విశ్లేషకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..