విశాఖపట్నం, 4 సెప్టెంబర్ (హి.స.), తప్పుడు పత్రాలతో రుణాలు తీసుకొని కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విశాఖపట్నం సబ్ జోనల్ అధికారులు రూ.2.22 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. కొవ్వూరి శ్రీనివాస్, ఆడారి చంద్రకళ, దేవసాని నిర్మల కలిసి కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద చేపల చెరువుల పేరిట కంచరపాలెంలోని కెనరా బ్యాంకులో రుణాలు పొందారు. అందుకోసం నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు సమర్పించారు. రుణం తిరిగి చెల్లించలేదు. అధికారుల విచారణలో మోసాలు బయటపడ్డాయి. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు దేవసాని నిర్మల, ఆడారి చంద్రకళ, కొవ్వూరి శ్రీనివా్‌సలతో పాటు డీవీకే కుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ముగ్గురికీ మొత్తం రూ.5.5 కోట్ల రుణం మంజూరు కాగా, అందులో రూ.4.57 కోట్లను డీవీకే కుమార్ తీసుకున్నట్టు గుర్తించారు. ఆయన ఆ మొత్తాలను స్నేహితులు, బంధువుల ఖాతాలకు మళ్లించారు. కొంత మొత్తంతో భార్య సునీత పేరిట స్థిరాస్తులు కొన్నారు. విచారణలో ఈ విషయాలను గుర్తించి రూ.2.22 కోట్ల ఆస్తులను జప్తు చేశారు. అందులో చరాస్తులు కూడా రూ.1.36 లక్షలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ