మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. పెరగనున్న రీసైక్లింగ్‌ సామర్థ్యం.. రూ.1500 కోట్లతో ప్రోత్సాహక పథకం
ఢీల్లీ, 4 సెప్టెంబర్ (హి.స.)దేశంలో కీలకమైన ఖనిజాల రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు ముందడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం. మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో 15 వందల కోట్ల విలువైన ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన
మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. పెరగనున్న రీసైక్లింగ్‌ సామర్థ్యం.. రూ.1500 కోట్లతో ప్రోత్సాహక పథకం


ఢీల్లీ, 4 సెప్టెంబర్ (హి.స.)దేశంలో కీలకమైన ఖనిజాల రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు ముందడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం. మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో 15 వందల కోట్ల విలువైన ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌లో భాగంగా అమలులోకి రానుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు మొత్తం ఆరు సంవత్సరాల పాటు అమలులో ఉంటుందని చెబుతున్నారు. బ్యాటరీ వ్యర్థాలు, ఈ-వేస్ట్ నుంచి కీలకమైన ఖనిజాలను వెలికితీయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద కొత్త రీసైక్లింగ్ యూనిట్ల స్థాపన కోసమే కాకుండా ఇప్పటికే ఉన్న యూనిట్ల విస్తరణ, ఆధునీకరణ కూడా ప్రోత్సాహం లభిస్తుంది. పెద్ద యూనిట్లకు గరిష్టంగా 50 కోట్లు, చిన్న యూనిట్లకు గరిష్టంగా 25 కోట్లు ప్రోత్సాహకంగా అందించనున్నారు.

15 వందల కోట్లలో మూడోవంతు నిధులు చిన్న, కొత్త రీసైక్లింగ్ సంస్థలకు కేటాయించనున్నారు. ప్లాంట్‌లు, యంత్రాలు, పరికరాలు, సదుపాయాలపై 20 శాతం క్యాపెక్స్ సబ్సిడీ అందించనుంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా సకాలంలో ఉత్పత్తి ప్రారంభించే యూనిట్లకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహక సబ్సిడీ లభిస్తుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ పథకం ద్వారా 8 వేల కోట్లకుపైగా పెట్టుబడులు దేశీయ పరిశ్రమల ద్వారా వస్తాయని భావిస్తున్నారు. ప్రత్యక్షంగా 70 వేల ఉద్యోగులు కూడా వస్తాయంటున్నారు అధికారులు.

ఇకపై ప్రతి సంవత్సరం కనీసం 270 టన్నుల ఈ-వేస్ట్‌ను రీసైక్లింగ్ చేయడం ద్వారా సుమారు 40 టన్నుల కీలక ఖనిజాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఏర్పడుతుంది. 2070 నాటికి సున్నా కార్బన్ ఉద్గారాల లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది మోదీ సర్కార్‌. ప్రపంచంలో ఖనిజాల కొరత పెరుగుతున్న సమయంలో రీసైక్లింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారత్ తన అవసరాలను తానే తీర్చుకునే దిశగా ముందడుగు వేస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande