అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.)కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసించారు.
ఇవి దేశ ప్రజలకు అసలైన దీపావళి కానుక అని ఆయన అభివర్ణించారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జీఎస్టీ భారాన్ని తగ్గించిందని ఈ రోజు గురువారం 'ఎక్స్' వేదికగా ఆయన పేర్కొన్నారు.
పేద, మధ్యతరగతి వర్గాలతో పాటు రైతులకు, ఆరోగ్య రంగానికి గణనీయమైన ఉపశమనం కల్పించడాన్ని ప్రత్యేకంగా స్వాగతిస్తున్నట్లు పవన్ తెలిపారు. జీవితాలకు భరోసా ఇచ్చే విద్య, బీమా రంగాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించడం ద్వారా ఎన్నో కుటుంబాల కష్టాలు తీరుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంస్కరణలు తీసుకొచ్చినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు, జీఎస్టీ కౌన్సిల్‌కు పవన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
బీ
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి