దిల్లీ:ముంబయి,07 సెప్టెంబర్ (హి.స.) వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) సంస్కరణలను ‘ప్రజల సంస్కరణ’గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. వైవిధ్యమైన ఉత్పత్తులకు రేట్ల హేతుబద్ధీకరణతో ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలుగుతుందని, వినియోగం పెరుగుతుందని తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని శనివారమిక్కడ ఆమె పేర్కొన్నారు. జీఎస్‌టీ రేట్ల కోతలను ధరల తగ్గింపు రూపంలో ప్రజలకు చేరువ చేసేందుకు తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని ఆమె చెప్పారు. పరిశ్రమ కూడా కోతలపై సానుకూలతను చూపించిందని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజుల్లోనే, కార్ల తయారీదారుల నుంచి ప్రభుత్వ బీమా కంపెనీలు, షూ, దుస్తుల బ్రాండ్లు ఇప్పటికే గణనీయంగా ధరల తగ్గింపును ప్రకటించాయని పేర్కొన్నారు. కొత్త జీఎస్‌టీ రేట్లు అమలయ్యే సెప్టెంబరు 22 నాటికి మిగిలినవి కూడా దీన్ని అనుసరించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ