మహబూబాబాద్ 7 సెప్టెంబర్ (హి.స.)
నెహ్రూసెంటర్, నర్సంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో శనివారం రైతుల ఆందోళనతో.. పోలీసు బందోబస్తు మధ్య రైతులకు యూరియా పంపిణీ చేయాల్సి వచ్చింది. రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. ఈ సమయంలో లారీ లోడు రాగా సగం బస్తాలను ఇక్కడ దింపి.. మిగిలినవి శనిగపురం పీఏసీఎస్‌కు తరలించాలనుకున్నారు. కానీ, అక్కడున్న రైతులు లారీని ముందుకు కదలనీయలేదు. వ్యవసాయ అధికారులు వచ్చాక యూరియా పంపిణీ చేస్తామని సిబ్బంది చెప్పడంతో మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిరీక్షించారు. అయినా ఇవ్వకపోవడంతో కొందరు రైతులు ఆగ్రహంతో లారీపైకి ఎక్కి బస్తాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
మరికొందరు లారీపైకి రాళ్లు రువ్వగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా రైతు సొమ్మసిల్లిపడిపోయారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ చేరుకుని నచ్చజెప్పడంతో రైతులు శాంతించారు. సంబంధిత అధికారులు వచ్చి ఆధార్‌కార్డుపై ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున 600 బస్తాలు పంపిణీ చేశారు. తర్వాత వచ్చే లోడుకు టోకెన్లు ఇవ్వాలని కొందరు కేంద్రంలోకి చొచ్చుకెళ్తుండగా.. యూరియా వచ్చిన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం ద్వారా పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారులు సర్దిచెప్పారు. అలాగే వరంగల్ జిల్లా నర్సంపేట పీఏసీఎస్ కేంద్రం వద్ద వరుసలో నిల్చున్న వారిలో ముగ్గురు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ