ముంబై, 7 సెప్టెంబర్ (హి.స.)
మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ భారీ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేసిన విషయం తెలిసిందే. కెమికల్ ఫ్యాక్టరీ మాటున భారీగా డ్రగ్స్ తయారవుతున్నట్లు గుర్తించి.. 13 మందిని అరెస్ట్ చేశారు. చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ లో మెఫ్రడీన్ అనే డ్రగ్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించి.. ముడి సరుకుని సీజ్ చేశారు. ఈ కేసులో కంపెనీ యజమాని సహా 13 మందిని అరెస్ట్ చేశారు. బంగాదేశీ మహిళ ఫాతిమా చెప్పిన ఆధారాలతో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.. తీగ లాగితే డొంకంతా కదిలినట్టైంది. ఈ కేసులో కొత్తకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
గురుగ్రామ్ లోని కిమియా బయో సైన్స్ నుంచి వాగ్దేవి ల్యాబ్స్ కి ముడి సరుకులు వచ్చినట్లు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. వాటిపై లేబుల్స్ ను మార్చి సరుకు రవాణా చేసినట్లుగా చెప్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రోజువారి కూలీలతో పనులు చేయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. దీంతో ఆ కంపెనీలో పనిచేసిన కూలీలను విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. మరోవైపు నిన్న సీజ్ చేసిన ముడిసరుకును ముంబైకి తరలించారు. వాసవి ల్యాబ్స్ కు ఇంకా ఎక్కడెక్కడి నుంచి, ఏయే రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తయారీకై ముడి సరుకు రవాణా జరిగిందన్నదానిపై మహారాష్ట్ర పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు