అనకాపల్లి , 7 సెప్టెంబర్ (హి.స.)
జాతీయ రహదారిపై సాఫీగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డు బయటకు వెళ్లే క్రమంలో అక్కడున్న రెయిలింగ్, స్తంభం దిమ్మెను ఢీకొట్టి.. తలకిందులుగా నిలిచిపోయింది. అదృష్టవశాత్తు అందులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం జరిగింది. విశాఖ నగరంలోని కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి కారులో విజయవాడ బయలుదేరారు. ఒడ్డిమెట్ట సమీపానికి రాగానే వాహనం అదుపుతప్పి.. ఇనుప రెయిలింగ్, దాని పక్కనే ఉన్న స్తంభం దిమ్మెను ఢీకొంది. ఇంజిన్ భాగం రెయిలింగ్, స్తంభం దిమ్మె మధ్య బలంగా ఇరుక్కుపోయి.. కారు వెనుక భాగం అమాంతం పైకి లేచి, అలాగే ఉండిపోయింది. వాహనంలోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో దంపతులు స్వల్ప గాయాలతో, పిల్లలిద్దరు క్షేమంగా బయటపడ్డారు. రెయిలింగ్, స్తంభం లేకపోతే ప్రమాద తీవ్రత ఎక్కువయ్యేదని స్థానికులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ