తిరుమల 7 సెప్టెంబర్ (హి.స.)
,:చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3.30 నుంచి సోమవారం వేకువజాము 3 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం మొదలై సోమవారం వేకువజామున 1.31 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణానికి 6 గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ. సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం మొదలవుతుంది. అయితే శనివారం సాయంత్రానికే సర్వదర్శన క్యూలైన్ బాటగంగమ్మ ఆలయం వరకు వ్యాపించింది. ఈ క్రమంలో వీరందరికీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలలోపు దర్శనం పూర్తిచేయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఆదివారం నాటి ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలతో పాటు పౌర్ణమి గరుడసేవను కూడా టీటీడీ రద్దు చేసింది. మరోవైపు గ్రహణం కారణంగా అన్నప్రసాద కేంద్రాన్ని ఆదివారం సాయంత్రం 3 గంటలకే మూసివేస్తారు. తిరిగి సోమవారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో తిరుమలలోని పలు ప్రదేశాల్లో దాదాపు 30 వేల అన్నప్రసాద ప్యాకెట్లను అందించేలా ప్రణాళికలు రూపొందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ