శ్రీకాళహస్తి, 7 సెప్టెంబర్ (హి.స.)నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించనుంది. రాత్రి 9.50 గంటల నుంచి 1.31 గంటల వరకూ చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడనుండగా.. ఆ సమయంలో చంద్రుడు ఎర్రగా (Blood Moon) మారనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 85 శాతం మందికి ఈ దృశ్యం కనిపించనుంది. కాగా.. గ్రహణ కాలంలో దాదాపు అన్ని ఆలయాల తలుపుల్ని అర్చకులు మూసివేస్తారన్న విషయం తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రెండు ఆలయాలు గ్రహణ సమయంలో తెరిచే ఉంటాయి. వాటిలో ఒకటి ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయం (Srikalahasti Temple). ఈ ఆలయం గ్రహణ గండాలకు అతీత క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ గ్రహణకాలంలో ప్రత్యేక శాంతిపూజలు నిర్వహించనున్నారు. రోజూ మాదిరిగానే రాత్రి 9 గంటలకు యథావిధిగా ఆలయాన్ని మూసివేసి.. గ్రహణ సమయంలో ఆలయాన్ని తెరవనున్నారు. రాత్రి 11 గంటలకు ఆలయంలో అర్చకులు గ్రహణకాల అభిషేకాలు, శాంతిపూజలు నిర్వహించనున్నారు. అయితే ఈ సమయంలో భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. తిరిగి రేపు ఉదయం భక్తులకు దర్శనం కల్పిస్తారు.
గ్రహణకాలంలో అత్యంత శక్తివంతమైన కిరణాలు విడుదలవుతాయని, ఆ కిరణాలు చెడు ప్రభావాన్ని చూపుతాయనే ఆలయాలను మూసివేస్తారు. ఈ శక్తి గోపురాల్లోఉండే కాస్మిక్ ఎనర్జీపై ప్రభావం చూపుడంతో విగ్రహాల్లో ఉండే దేవతల శక్తి పోతుందనే నమ్మకంతోనే ఆలయాలను మూసివేస్తారు. అయితే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవగ్రహ కవచం ఉందని, దానివల్ల దైవశక్తి క్షీణించదని చెప్తారు. అందుకే గ్రహణ సమయంలోనూ ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. గ్రహణకాలంలో తెరిచి ఉండో రెండో ఆలయం.. తూ.గో. జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో ఉన్న కుక్కుటేశ్వరస్వామి వారి దేవస్థానం. ఈ ఆలయంలోనూ గ్రహణసమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి