
హైదరాబాద్, 01 జనవరి (హి.స.)
క్యాలెండర్లు మారుతున్నాయే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ఓటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు ఉన్న దుస్థితి మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తోందని ఆరోపించారు. పండగ పూట కూడా రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం చల్లటి చలిలో గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన దయనీయ పరిస్థితి కాంగ్రెస్ పాలనలో మళ్లీ వచ్చిందని దుయ్యబట్టారు. ఇవాళ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా భావోద్వేగభరితమైన ప్రసంగం చేసిన కేటీఆర్.. 2028లో కెసిఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిగా చూడటమే బీఆర్ఎస్ లక్ష్యమని, అదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..