
అమరావతి, 10 జనవరి (హి.స.) సంక్రాంతికి సొంతూళ్లకు తరలివచ్చే వారితో ఏర్పడే రద్దీని ఆసరాగా తీసుకుని ప్రైవేటు బస్సుల యజమానులు అధిక ఛార్జీలు వసూలుచేస్తే చర్యలు తీసుకుంటామని, ధరలు పెంచకుండా పర్యవేక్షిస్తున్నామని రవాణాశాఖ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. ఆర్టీసీ టికెట్ ఛార్జీల కంటే గరిష్ఠంగా 50% వరకు మాత్రమే టికెట్ ధర పెంచేందుకు వీలుందని, అంతకంటే ఎక్కువ వసూలుచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేలా అన్ని జిల్లాల్లోని రవాణాశాఖ అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. అభి బస్, రెడ్ బస్ వంటి యాప్‌ల ద్వారా కూడా ఆయా ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఎంత టికెట్ ధరలు వసూలు చేస్తున్నాయో పర్యవేక్షిస్తున్నామని, అధిక ధరలు ఉంటే కేసులు పెడతామని చెప్పారు. ఈ నెల 18 వరకు అన్ని జిల్లాల్లో నిత్యం తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ప్రైవేటు బస్సులో రవాణాశాఖ హెల్ప్‌లైన్ నంబరు9281607001ను డిస్‌ప్లే చేయాలని యజమానులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ