
హైదరాబాద్, 10 జనవరి (హి.స.)
తెలంగాణలోనూ పిల్లల దగ్గుమందుపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అల్మాంట్-కిడ్ సిరప్ (Almont-Kid Syrup)ను వాడవద్దని హెచ్చరించింది. అది దగ్గు మందు కాదని, దగ్గుమందు రూపంలో ఉన్న స్లో పాయిజన్ అని తెలిపింది.
ఈ దగ్గుమందులో ఎథిలీన్ గ్లైకాల్ కలిసినట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. దీంతో సిరప్ వినియోగాన్ని వెంటనే నిలిపివేయాల్సిందిగా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఔషధ ప్రమాద నియంత్రణ సంస్థ (CDSCO) ఈస్ట్ జోన్, కోల్ కతా నుంచి వచ్చిన అలర్ట్ ఆధారంగా రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ శాఖ ప్రకటించింది. బిహార్ కు చెందిన ట్రిడస్ రెమిడీస్ అనే ఫార్మా సంస్థ తయారు చేసిన AL-24002 బ్యాచ్ సిరప్ శాంపిల్స్ ను పరిశీలించగా.. అత్యంత విషపూరితమైన ఎథిలీన్ గ్లైకాల్ ఉన్నట్లు తేలిందని అధికారులు వివరించారు. ఇది శరీరంలోని కిడ్నీలు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకరమైన కెమికల్ అని, పిల్లలకు ప్రాణాపాయం కలిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు