
అమరావతి, 11 జనవరి (హి.స.)
ఏపీలో సంక్రాంతి సందడి స్టార్ట్ అయింది. పట్నం నుంచి ప్రజలు పల్లెబాట పట్టగా.. బస్సులు, రైళ్లు, కార్లు అన్నీ ఫుల్ అయ్యాయి. తమ వాహనాల్లో సొంతూరికి వెళ్తుండటంతో హైవేలపై వెహికిల్స్ రద్దీ దర్శనమిస్తోంది. ఆంధ్రాలో సంక్రాంతి అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఉభయ గోదావరి జిల్లాలు. అతిథులకు ఆతిథ్యం ఇవ్వడంలో వాళ్లకు సాటి ఎవరూ లేరని చెప్పాలి. అందుకు తగ్గట్టే అక్కడ ఏర్పాట్లు ఉంటాయి. ఇక, గోదావరి జిల్లాల్లో కోడి పందేలు ఏ స్థాయిలో జరుగుతాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్ల రూపాయలు పందేల కోసం చేతులు మారుతుంటాయి. కోడి పందేలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే భీమవరంలో ఈసారి పండుగ జోష్ ఊపందుకుంది. ఇక్కడి కోడి పందేలను చూసేందుకు ఆంధ్రాలో ఉన్నవారే కాదు.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలిస్తుంటారు. దీంతో భీమవరంతో పాటు చుట్టుపక్కల టౌన్లలో ఉన్న లాడ్జీలు, హోటల్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది.
అయితే, భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, రాజమండ్రి లాంటి పట్టణాల్లో సుమారు 150 హోటల్స్ లో ఒక్క గది కూడా ఖాళీగా లేదు. రూమ్స్ కి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. ఈ డిమాండ్ ను సాకుగా చూపిస్తూ.. హోటళ్లు, లాడ్జీల యజమానులు గదుల అద్దెలను భారీగా పెంచేశాయి. సాధారణ రోజుల్లో రోజుకు రూ.1000 – రూ.5000 పలికే గది అద్దెను ప్యాకేజీల కింద డివైడ్ చేశారు. మూడు రోజులకే రూ.30 వేలు నుంచి రూ.60 వేలు వరకూ డిమాండ్ చేస్తున్నారు. కొన్ని స్టార్ హోటల్స్ అయితే ఒక్కో గదికి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు వచ్చిన టూరిస్టులు తప్పక యజమానులు అడిగిన అద్దెను చెల్లిస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా గెస్ట్ హౌస్ లను ముందే రిజర్వ్ చేయడంతో పర్యాటకులకు వసతి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. కల్యాణ మండపాలు, హోమ్ స్టేలు సైతం రెంట్ కి తీసుకుంటున్నారు.
ఇక, కోడి పందేల విషయానికి వస్తే.. ఈసారి బరుల దగ్గర పందేల జోరు మరింత పెరిగింది. నిర్వాహకులు ఇప్పటికే పందెం రాయుళ్లతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం ఈసారి తాడేపల్లిగూడెంలో రూ.2.5 కోట్లతో భారీ పందెం కొనసాగుతుండగా.. సీసలి, నారాయణపురం, చిన అమిరం లాంటి ప్రాంతాల్లో రూ.కోటి పందేలు వేసేందుకు సిండికేట్లు రెడీ అవుతున్నాయి. గతేడాది కోడి పందేల్లో గెలిచిన పందెం రాయుళ్లను బరులకు రప్పించేందుకు పోటీ పడుతున్నారు. గోదావరి జిల్లాల్లో కోడి పందేలు చూడటానికి సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా వస్తుంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ