
అమరావతి, 11 జనవరి (హి.స.)
: వృద్ధ దంపతులు సైబర్ మాయగాళ్ల వలలో చిక్కారు. 17 రోజలు డిజిటల్ అరెస్టులో ఉండి.. జీవితకాలం దాచుకున్న సుమారు రూ.15 కోట్లను పొగోట్టుకున్నారు. ఈ ఘటన తాజాగా దిల్లీలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డా. ఓం తనేజా ఆయన భార్య డా. ఇందిరా తనేజాలు 48 ఏళ్లు ఐక్యరాజ్యసమితిలో సేవలందించారు. రిటైర్‌మెంట్ అనంతరం 2015లో భారత్‌కు వచ్చారు.
గత డిసెంబర్ 24న.. ఆ దంపతులకు పోలీసు అధికారులమంటూ.. సైబర్ నేరగాళ్ల నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. వారిపై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అరెస్టు వారెంట్లతో ఆ దంపతులను బెదిరించారు. డిసెంబర్ 24 నుంచి జనవరి 10 వరకు డిజిటల్ అరెస్టు చేస్తున్నామని వీడియో కాల్‌లో హెచ్చరించారు. ఆ సమయంలో ఆ దంపతుల నుంచి రూ.14.85 కోట్లను కాజేశారు. అనంతరం సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదిస్తే ఆర్‌బీఐ ఆదేశాల మేరకు డబ్బులు తిరిగి వస్తాయని స్కామర్లు వారికి సూచించారు. దీంతో వృద్ధ దంపతులు పోలీసుస్టేషన్‌కు వెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారిపై ఎలాంటి అరెస్టు వారెంట్లు లేవని..సైబర్ మాయగాళ్లు మోసం చేశారని ఆ దంపతులు తెలుసుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ