
అమరావతి, 11 జనవరి (హి.స.)
సంక్రాంతి పండగ ప్రభావంతో నాటుకోడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పండగకు నాటుకోడి మాంసం వండుకుని తినడం సంప్రదాయంగా వస్తుండటంతో, ఈ ఏడాది డిమాండ్ మరింత పెరిగింది. ఉత్పత్తి తగ్గడం, పెంపకం చేసే వారి సంఖ్య తగ్గిపోవడం వల్ల ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం (జనవరి 2026) సంక్రాంతి డిమాండ్ నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో కేజీ నాటుకోడి ధర రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. ప్రాంతం, డిమాండ్‌ను బట్టి ధరల్లో తేడా కనిపిస్తున్నా, మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా నాటుకోడికి భారీ డిమాండ్ నెలకొంది. హైదరాబాద్ వంటి నగరాల్లోనూ కేజీ నాటుకోడి ధర రూ.500 నుంచి రూ.1,000 వరకు చేరుకుంది.
పుంజుల కంటే పెట్టలకే డిమాండ్!
గ్రామాల్లో నాటుకోళ్లు దొరకడం కష్టంగా మారింది. ఎక్కడ లభిస్తాయో తెలుసుకునేందుకు తెలిసినవారిని ఆరా తీస్తున్నారు. పుంజుల కంటే పెట్టలకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో, వాటి కొనుగోలుకు పోటీ నెలకొంది. కేజీ మటన్ ధర రూ.800గా ఉండగా, దానికంటే ఎక్కువ ధరకు నాటుకోడి విక్రయమవడం విశేషంగా మారింది. ఇదిలా ఉండగా, నాటుకోళ్ల పెంపకం తగ్గిపోవడం వల్ల సరఫరా తగ్గింది. అదే సమయంలో పండగ డిమాండ్ పెరగడంతో ధరలు అమాంతం పెరిగాయని వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి. గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
స్కిన్‌లెస్ చికెన్ ధరలు ఎంతంటే?
నాటుకోడి ధరలు పెరిగినా, స్కిన్‌లెస్ చికెన్ ధరలు మాత్రం గత వారంతో పోలిస్తే స్థిరంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.300 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ.300, గుంటూరులో రూ.290, నంద్యాల జిల్లాలో రూ.240 నుంచి రూ.280, కాకినాడలో రూ.300, వరంగల్‌లో రూ.300గా ఉన్నాయి. మొత్తంగా చూస్తే, సంక్రాంతి పండగ కారణంగా నాటుకోడి ధరలు రికార్డు స్థాయిలో పెరిగినా, సాధారణ చికెన్ ధరలు మాత్రం సామాన్యులకు అందుబాటులోనే కొనసాగుతున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV