
హైదరాబాద్, 11 జనవరి (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ ఆవేదన చెందారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రంలో భూ మాఫియా గుండాల ఆగడాలు రోజు రోజుకు మితిమీరి పోతున్నాయని ఆరోపించారు. 'సీఎం రేవంత్ రెడ్డి ఏలుబడిలో భూ మాఫియా రౌడీలు బహిరంగంగా ప్రజల ప్రాణాలు తీయడానికి కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేస్తున్నా నిచ్చేస్టులై చూస్తున్న యంత్రాగం.. మాఫియాకు కొమ్ము కాస్తూ ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు' అని ఆరోపించారు.
ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల పనితీరుకు, చేతకాని తనానికి పరాకాష్ట ఏకశిలా నగర్లో జరిగిన దాడి అని తీవ్ర ఆరోపణలు చేశారు. 'స్వయంగా ఒక ఎంపీ ఏకశిలా నగర్లో జరుగుతున్న గుండాల అరాచకాలను బయటపెట్టినా.. అధికారులను, ప్రభుత్వాన్ని హెచ్చరించిన తర్వాత కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. ఈ ఘటనను ఊరికే వదిలిపెట్టం' అని వార్నింగ్ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు