
హైదరాబాద్, 11 జనవరి (హి.స.)
ఛత్తీస్గఢ్ ఇటీవల జరిగిన బస్తర్ ఎన్ కౌంటర్ ఘటనపై మావోయిస్టులు సంచలన ప్రకటన విడుదల చేశారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో జనవరి 3న జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో తమకు చెందిన 14 మంది సభ్యులు మృతి చెందినట్టు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఒక పత్రికా ప్రకటనలో ఆరోపించింది. మావోయిస్టుల ప్రకటన ప్రకారం, దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యులు, కొందరు ఏరియా కమిటీ సభ్యులు, పార్టీ సభ్యులపై 2026 జనవరి 3న ఉదయం బుర్కలంక, పామలూర్, గట్టపాడ్ గ్రామాల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు దాడి చేశాయి. ఈ దాడిలో మా 12 మంది సహచరులు అమరులయ్యారని తెలిపారు. అదే రోజు అర్ధరాత్రి ప్రాంతంలో బాసా గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగనపాడ్ గ్రామంలో సమాచారం ఆధారంగా పామేడ్ ఏరియా కమిటీ సభ్యుడు మడ్కం హుంగా దాదా, ఆయనతో పాటు ఉన్న ఆయతేను పోలీసులు పట్టుకున్నారని, వారిని అత్యంత క్రూరంగా హింసించి, బూటకపు ఎన్ కౌంటర్ చేసి చంపేశారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా పోలీస్ అధికారులు మాత్రం అధికారికంగా ఇద్దరు నక్సలైట్లు మాత్రమే మృతి చెందినట్టు ప్రకటించినట్టు మావోయిస్టు ప్రకటనలో ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు