
హైదరాబాద్, 11 జనవరి (హి.స.)
గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా
ఇన్స్టాగ్రామ్ యూజర్ల డేటా లీక్ అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. యూజర్లు వెంటనే తమ యూజర్ నేమ్, పాస్ వర్డ్స్ మార్చుకోవాలని కొన్ని ఈ మేయిల్స్ వచ్చినట్లు అనేక వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలను మెటా సంస్థ ఖండించింది. చాలా మంది యూజర్లకు అనుకోకుండా 'పాస్వర్డ్ రీసెట్' మెయిల్స్ రావడంతో, తమ ఖాతాలు హ్యాక్ అయ్యాయని ఆందోళన చెందారు. అయితే, ఇది డేటా లీక్ వల్ల జరిగింది కాదని, తమ సిస్టమ్స్ లో ఎలాంటి లోపం లేదని ఇన్స్టాగ్రామ్ స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. పాస్వర్డ్ రీసెట్ మెయిల్స్ రావడానికి కారణమైన సాంకేతిక లోపాన్ని (బగ్) ఇప్పటికే పరిష్కరించినట్లు కంపెనీ వెల్లడించింది. వినియోగదారులు తమకు వచ్చిన ఆ మెయిల్స్ను పట్టించుకోవద్దని, పాస్వర్డ్ మార్చుకోవాల్సిన అవసరం లేదని సూచించింది. ప్రతి ఒక్కరి ఖాతా సురక్షితంగా ఉందని భరోసా ఇస్తూ, ఈ సంఘటన వల్ల యూజర్లలో ఏర్పడిన గందరగోళానికి సంస్థ క్షమాపణలు కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు