
హైదరాబాద్, 11 జనవరి (హి.స.)
సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణవాసులందరూ పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ నగరం నుంచి విజయవాడ, కర్నూల్, తమిళనాడు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మెదిగా కదులుతున్నాయి. ఏపీకి వెళ్లే వాహనాల కోసం ఎక్కువ టోలూత్లు ఏర్పాటు చేశారు. అయినా రద్దీ కొనసాగుతోంది. నిన్న ఏపీకి 60 వేల వాహనాలు వెళ్లాయని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు.
ఈ రోజు మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. రద్దీ దృష్టిలో పెట్టుకొని టోల్ ప్లాజా వద్ద వాహనాలకు ఫాస్టాగ్ స్కాన్ వేగంగా చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి టోల్ ప్లాజా వద్ద నాలుగు హ్యాండ్ మిషన్లు, స్టిక్ మిషన్ ఏర్పాటు చేశారు. అలాగే పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనం, క్రేన్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. విజయవాడ వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు