
అమరావతి, 11 జనవరి (హి.స.)
కోనసీమ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయపురంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ భోజన ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. గోదావరి జిల్లాలకే ప్రత్యేకమైన సంప్రదాయ వంటకాలు, నోరూరించే పిండివంటలతో ఈ ఉత్సవం ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని కూడా పంచుతోంది. పండగ సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్న పర్యాటకులతో ఆత్రేయపురం సందడిగా మారింది.
ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణ ‘ఆత్రేయపురం పూతరేకులు’. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ పూతరేకులను ఇక్కడ ప్రత్యేక స్టాల్స్‌లో ప్రదర్శిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, పిస్తా , బెల్లం పొడితో తయారు చేసిన ఈ పూతరేకుల కోసం పర్యాటకులు క్యూ కడుతున్నారు. వీటితో పాటు నెయ్యిలో దోరగా వేయించిన నేతి బొబ్బట్లు, సున్నుండలు, బెల్లం గవ్వలు , కారం గవ్వల సువాసనలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
ఈ ఉత్సవం కేవలం ఆహారానికే పరిమితం కాకుండా, మహిళా సాధికారతకు వేదికగా నిలిచింది. ఈ ఫుడ్ ఫెస్టివల్‌ను పూర్తిస్థాయిలో డ్వాక్రా (DWACRA) మహిళల ద్వారా ఏర్పాటు చేశారు. ఆత్రేయపురం గ్రామంలో సుమారు 1500 మంది మహిళలు పూతరేకుల తయారీపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ కళ ద్వారా వారు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారని, గౌరవప్రదమైన సంపాదనతో తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని స్థానిక ప్రతినిధులు గర్వంగా చెబుతున్నారు.
ఆధునిక పోకడలకు భిన్నంగా, ఈ ఫెస్టివల్‌లో ప్రకృతి సిద్ధమైన ఆహార పదార్థాలకు ప్రాధాన్యతనిచ్చారు. మామిడి తాండ్రి, తాడి తాండ్రి రోల్స్ ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయని, ఇవి పర్యాటకులకు ఇష్టమైన చిరుతిండిగా మారాయని నిర్వాహకులు తెలిపారు. అలాగే, మైదా , ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా కేవలం చిరుధాన్యాలతో (Millets) తయారు చేసిన నూడిల్స్ వంటి హోమ్ మేడ్ వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆత్రేయపురం పూతరేకులకు ఉన్న క్రేజ్ వల్ల కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల నుండి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. హైదరాబాద్ , వైజాగ్ నుండి వచ్చిన పర్యాటకులు మాట్లాడుతూ.. ఇక్కడ ఫుడ్ క్వాలిటీ అద్భుతంగా ఉందని, ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో (Reasonable) ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. ఫుడ్ ఫెస్టివల్‌తో పాటు బోట్ రేసింగ్, స్విమ్మింగ్ వంటి వినోద కార్యక్రమాలను కూడా పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. మొత్తానికి, గోదావరి జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు , అద్భుతమైన రుచులను ఒకే చోట ఆస్వాదించే అరుదైన అవకాశం ఈ ఆత్రేయపురం ఫుడ్ ఫెస్టివల్ ద్వారా లభిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ