
విజయవాడ, 11 జనవరి (హి.స.)
రేపు జరగనున్న వివేకానంద జయంతిని (Vivekananda Jayanti) పురస్కరించుకొని ఏపీ బిజెవైఎం (BJYM Andhra Pradesh) ఆధ్వర్యంలో 5కె మారథాన్ (Youth Marathon) ఈ రోజు ఉదయం నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా విజయవాడలోనూ మారథాన్ ను ఈ రోజు ఆదివారం జరిపారు. ఎంజీ రోడ్డులోని రాఘవయ్య పార్కు వద్దనున్న స్వామి వివేకానంద పార్కు నుంచి మారథాన్ ప్రారంభమయ్యింది.
కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ యూత్ మారథాన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఆయనతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సలహాదారులు, మాజీ ఐపీఎల్ ఆటగాడు, కెకె క్రికెట్ అకాడమీ వ్యవస్థాపకుడు కల్యాణ్ కృష్ణ దొడ్డపనేని, గౌరవ ఆహ్వానితులుగా బిజెవైఎం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ హాజరయ్యారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన రన్ లో ఔత్సాహికులతో కలిసి పరుగులు తీశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువత నిర్భయంగా ఉండాలన్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అహర్నిశలు శ్రమించాలన్నారు. భారత భవిష్యత్తు నిర్మాణం కోసం పరుగులు తీయాలని పిలుపునిచ్చారు. వ్యక్తి నిర్మాణమే దేశ నిర్మాణం అని అభిప్రాయపడ్డారు. దేశ ఖ్యాతిని, భారతీయ సంస్కృతి ఘనతను ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. భారత్ మాతాకీ జై అని పెద్ద ఎత్తున నినదించారు. ఈ మారథాన్ లో వందలాది మంది యువతీ యువకులు, ఔత్సాహికులు, క్రీడాకారులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV