
వాషింగ్టన్, డి.సి., 13 జనవరి (హి.స.)
అమెరికా ప్రభుత్వం నేరాలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనలు, నేర కార్యకలాపాలపై ఎవరూ ఊహించని స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా 2025 లో ఇప్పటివరకు 1,00,000కు పైగా వీసాలను రద్దు చేసినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. న్యూయార్క్, వాషింగ్టన్ కేంద్రంగా వెలువడిన సమాచారం ప్రకారం, రద్దు చేసిన వాటిలో సుమారు 8,000 మంది విద్యార్థుల వీసాలు కూడా ఉన్నాయి. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని, నేర ప్రవృత్తి గలవారిని నిలువరించే విస్తృత ప్రయత్నాల్లో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అమెరికా చట్ట అమలు సంస్థలతో నేరపూరితమైన గొడవలు, ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుని ఈ వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ (State Department) సోమవారం ఒక సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేసింది. రద్దయిన వాటిలో 8,000 విద్యార్థి వీసాలతో పాటు, 2,500 ప్రత్యేక వీసాలు (specialised visas) కూడా ఉన్నాయని తెలిపింది. అమెరికాను సురక్షితంగా ఉంచేందుకు, ఇలాంటి దుర్మార్గులను దేశం నుంచి బహిష్కరించే (deport) ప్రక్రియను మేము కొనసాగిస్తాం అని స్టేట్ డిపార్ట్‌మెంట్ ఘాటుగా వ్యాఖ్యానించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV