
మొజాంబిక్, 18 జనవరి (హి.స.)
ఆగ్నేయ ఆఫ్రికా దేశాలను జల ప్రళయం అతలాకుతలం చేస్తుంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. వరదలు సంభవించి.. మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాయుగుండం ప్రభావంతో కురిసిన ఈ భారీ వర్షాల వల్ల ఇప్పటివరకు వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక్క జింబాబ్వేలో దాదాపు 70 మంది మరణించగా, దక్షిణాఫ్రికాలో 30 మందికి పైగా మృతి చెందారు. వరదల ఉధృతికి అనేక భవనాలు, వంతెనలు పేకమేడల్లా కొట్టుకుపోయాయి, దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా మొజాంబిక్‌లో సుమారు 2 లక్షల మంది నిరాశ్రయులవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
సహాయక చర్యల కోసం ప్రభుత్వం హెలికాప్టర్లను రంగంలోకి దించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా, ఒక నేషనల్ పార్క్‌లో చిక్కుకుపోయిన 600 మంది పర్యాటకులను రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వర్షాల ధాటికి నదులు పొంగిపొర్లడం, కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV