
ఢిల్లీ, 05 జనవరి (హి.స.)అస్సాం, త్రిపురలోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. మోరిగావ్ లో 5.1, గోమతిలో 3.9 తీవ్రతతో భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్లలోంచి పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు లేవు, అయితే కొన్ని పురాతన భవనాలకు పగుళ్లు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
అస్సాం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. మోరిగావ్, త్రిపురలోని గోమతిలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో భయపడిపోయిన జనాలు ఇళ్లలోంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. మోరిగావ్‌లో రిక్టర్ స్కేలుపై భూ ప్రకంపనల తీవ్రత 5.1గా నమోదైనట్టు అధికారులు గుర్తించగా, గోమతిలో 3.9గా నిర్ధారించారు. మోరిగావ్‌కు 50కి.మీ లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్టు అధికారులు స్పష్టం చేశారు.
అయితే ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం జరిగినట్టు కాని ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనలు వెలువడ లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లోని పురాతన భవనాలకు మాత్రం చిన్నపాటి పగుళ్లు గుర్తించినట్టు స్థానికులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV