
హైదరాబాద్, 06 జనవరి (హి.స.)
2026 లో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు (Inventories) పెరగడం, డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో బ్రెంట్ క్రూడ్ ధర జూన్ 2026 నాటికి బ్యారెల్కు 50 డాలర్ల స్థాయికి పడిపోవచ్చని అంచనా వేసింది. అమెరికా ఇంధన సమాచార సంస్థ (US EIA) కూడా 2026 మొదటి త్రైమాసికంలో ధరలు సగటున 55 డాలర్లకు తగ్గుతాయని పేర్కొంది. అంతర్జాతీయ ధరలతో భారతీయ క్రూడ్ బాస్కెట్కు దగ్గరి సంబంధం ఉన్నందున, దేశీయంగా కూడా ముడి చమురు ధరలు గణనీయంగా దిగి రానున్నాయి.
ప్రస్తుతం బ్యారెల్కు 62.20 డాలర్లుగా ఉన్న భారతీయ క్రూడ్ ధరలు, రానున్న రోజుల్లో 53.31 డాలర్లకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని నివేదిక తెలిపింది. దీనివల్ల దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి రావడమే కాకుండా, పెట్రోల్ బంకుల్లో సామాన్యులకు ఇంధన ధరల భారం తగ్గనున్నట్లు తెలిపింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు