
అమరావతి, 08 జనవరి (హి.స.)
ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం అధ్యక్షతన 35 అంశాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు, ఎంఎస్‌ఎంఈ పరిధిలో ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం, బార్లలో అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రువరీలు ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాల్లో జల్‌జీవన్ ద్వారా నీటి సరఫరాకు రూ.5 వేల కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారెంటీ వంటి అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
అలాగే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుతో పాటు 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల కిట్‌లు పంపిణీకి 944.53 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సంప్రదాయేతర ఇంధన, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు, మరో రూ.19,391 కోట్ల పెట్టుబడుల ద్వారా 11,753 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలు, పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులకు సంబంధించి మొత్తంగా 14 సంస్థల ఏర్పాటు, అమరావతిలో కృష్ణా తీరంలో మెరీనా ప్రాజెక్టు ఏర్పాటుకు ఈ భేటీలో మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV