
అమరావతి, 08 జనవరి (హి.స.)
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై సీఎం చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పలు అంశాలపై జగన్ కీలకవ్యాఖ్యలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని, ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. రాయలసీమకు తాము తలపెట్టిన ఎత్తిపోతల పథకం.. సంజీవని లాంటిదన్నారు. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనుకున్న తమపై.. విమర్శలు చేస్తుండటం బాధాకరమని జగన్ వాపోయారు. తనపై ఉన్న గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతలను ఆపారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే.. తామెప్పుడూ అలాంటి హామీలివ్వలేదని చంద్రబాబు చెప్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రాయలసీమ ప్రజలకు చంద్రబాబు విలన్ లా మారారన్నారు. సొంత రాష్ట్రాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టుపెట్టారని, ఇందుకు రేవంత్ ఇచ్చిన స్టేట్మెంటే సాక్ష్యమని పేర్కొన్నారు. రేవంత్ తో చంద్రబాబు రహస్య ఒప్పందానికి అధికార ముద్రవేశారని సంచలన ఆరోపణలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వెనుక గొప్ప ఉద్దేశం ఉందని, అలాంటి ప్రాజెక్టును మంత్రులు వద్దంటుండటంపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు ఆనాడు ఎన్టీఆర్ ను, నేడు జన్మనిచ్చిన సీమను వెన్నుపోటు పొడిచేందుకు వెనుకాడలేదని తీవ్ర విమర్శలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV