
కోల్కత్తా, 09 జనవరి (హి.స.)
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వాతావరణం నెలకొన్న వేళ మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోసును హత్య చేస్తామని బెదిరింపు ఇవ్వడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. గురువారం అర్ధరాత్రి దాటాక గవర్నర్కు అపరిచితుడి నుంచి ఒక బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని లోక్ భవన్ వర్గాలు కూడా ధృవీకరించాయి. ఆ ఈ-మెయిల్లో గవర్నర్ను 'బాంబు పేల్చి చంపేస్తాము' అని బెదిరించారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... బెదిరింపు పాల్పడిన వ్యక్తి తన మొబైల్ నంబర్ను కూడా ఆ ఈ-మెయిల్లో తెలిపాడు. దీంతో ఈ బెదిరింపు విషయాన్ని గవర్నర్ కార్యాలయం వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, రాష్ట్ర డీజీపీకి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలిపింది. ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నర్ కు అదనపు భద్రతను కల్పించారు. రాష్ట్ర పోలీసులతో కలిసి కేంద్ర బలగాలు సంయుక్తంగా గవర్నర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు