
పిఠాపురం, 09 జనవరి (హి.స.)
ఏపీలో సంక్రాంతి సందడి మొదలైంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలతో పండుగ శోభ నాలుగురోజులు ముందే వచ్చేసింది. వీధుల్లో హరిదాసుల సందడి, రంగవల్లుల్లో గొబ్బెమ్మలు, ఆరుబయట పిండివంటలు, చుట్టాల కబుర్లు, బంతి భోజనాలు, కోడిపందేలతో పండుగ హడావిడి మొదలైంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ వేడుకలును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు భోగిపండ్లను పోసి ఆశీర్వదించారు. అనంతరం రాష్ట్రపర్యాటక శాఖ ఆధ్వర్యంలో హస్తకళలు, చేనేతకళల గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం తరపున సారెను అందించి ఆశీర్వదించారు. వారికి పోషక ఆహార కిట్లను అందజేశారు. అనంతరం సంక్రాంతి మహోత్సవాల్లో పవన్ కల్యాణ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడి కళాకారులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేయగా.. పవన్ స్టెప్పులకు అభిమానులు కేరింతలు కొట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV