
అమరావతి, 09 జనవరి (హి.స.)
ఆరోగ్యాంధ్ర నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ (Minister Satya Kumar) పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో (NTR Health University) శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సూపరింటిండెంట్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో సవాళ్లను అధిగమించి చిత్తశుద్ధితో పని చేయాలని వారికి సూచించారు. గతంతో పోలిస్తే ఓపీ, ఐపీలో చాలా మార్పులు తీసుకురాగలిగామని పేర్కొన్నారు.
ప్రజల్లో ప్రభుత్వ వైద్య సేవల పట్ల సంతృప్తి కనిపిస్తోందన్నారు. అయితే కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిసరాలు పరిశుభ్రంగా లేవనే ఆరోపణలు వచ్చాయని తెలిపారు. లోటుపాట్లను గుర్తించి వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగిందన్నారు.
ఆసుపత్రులకు ఎక్కువ మంది వస్తున్నారంటే అది వైద్య సేవల మెరుగుదలకు నిదర్శనం అన్నారు. వీలైనంత త్వరగా వైద్య సేవలను అందించేందుకు సాంకేతిక వినియోగాన్ని పెంచాలన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ఆసుపత్రుల పనితీరుపై వివరాల సేకరణ జరుగుతోందని తెలియజేశారు. 24 శాతం ఇంకా మెరుగుదల సాధించాల్సి ఉందన్నారు. విధులకు గైర్హాజరు అవుతున్న వైద్యుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని.. వారిని ఉపేక్షించబోమని మంత్రి సత్యకుమార్ హెచ్చరించారు. వారికి నోటీసులు ఇవ్వడమే కాదు అవసరమైతే విధుల నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV