
రాయచోటి, 09 జనవరి (హి.స.)
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ పరిధిలోని రింగ్ రోడ్డు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం అతివేగంతో వచ్చిన ఒక లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బైక్ లారీ కింద ఇరుక్కుపోగా, డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా సుమారు 30 మీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. ఘర్షణ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి లారీ క్యాబిన్ కు వ్యాపించాయి. మంటలను గమనించిన లారీ డ్రైవర్ అప్రమత్తమై కదులుతున్న వాహనం నుంచి కిందకు దూకేయడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు లారీ చక్రాల కింద నలిగి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న రాయచోటి అర్బన్, ట్రాఫిక్ పోలీసులు యుద్ధ ప్రాతిపదికన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ లారీ మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. మృతుడి వివరాలను సేకరిస్తున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV