
తిరుమల, 09 జనవరి (హి.స.)
గతేడాది డిసెంబర్ 30న తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. అవి ఇప్పుడితో ముగిశాయి. వైకుంఠద్వార దర్శనాలు విజయవంతంగా ముగియడంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
ఈ రోజు శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
వైకుంఠద్వార దర్శనాలు విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన అధికారులందరికీ ధన్యవాదాలను తెలియజేశారు. టీటీడీ చరిత్రలోనే ఇదొక అద్భుతమైన ఘట్టంగా నిలిచిందన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వైకుంఠద్వార దర్శనాలు అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులకు వైకుంఠద్వార దర్శన భాగ్యం కలిగిందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లు, సదుపాయాలపై 93శాతం భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. 2024లో 6.83 లక్షలు, 2023లో 6.47 లక్షలతో పోలిస్తే భక్తుల సంఖ్యలో గణనీయ వృద్ధి చెందిందని వివరించారు. 10 రోజుల్లో రూ.41 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందన్నారు. 44 లక్షల లడ్డూలు విక్రయించామని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే 10 లక్షలు అధికంగా విక్రయించడం జరిగిందని వివరించారు.
గతేడాదికంటే 27శాతం అధికంగా అన్నప్రసాదాల పంపిణీ చేపట్టామన్నారు. 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల పండ్లు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్‌తో అద్భుత అలంకరణలు తిరుమలలో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చాయన్నారు. కళ్యాణకట్ట, పారిశుద్ధ్యం, వైద్య సేవల ఏర్పాట్లు భక్తులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయని వెల్లడించారు. ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కారణంగా ఎక్కడా ఎటువంటి అవాంఛిత ఘటన చోటు చేసుకోకుండా చూడగలిగాం అన్నారు. ప్రణాళికాబద్ధ క్యూలైన్ నిర్వహణతో అంచనాలకన్నా ఎక్కువ మందికి దర్శనం కల్పించగలిగడం తమ అదృష్టంగా భావిస్తున్నామని టీటీడీ చైర్మన్ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ వైకుంఠద్వారా దర్శనాలను ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులకు, మెరుగైన సేవలు అందించిన అధికారులకు, సిబ్బందికి, సేవలకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV