
హైదరాబాద్, 01 అక్టోబర్ (హి.స.) దేశంలో జీఎస్టీ వసూళ్లు మరోసారి రూ.2 లక్షల కోట్లు దాటాయి. ఇప్పటికే జూలై, ఆగస్టు నెలల్లో కూడా వరుసగా రూ.2 లక్షల కోట్లు దాటిన స్థూల జీఎస్టీ కలెక్షన్స్.. సెప్టెంబర్ లోనూ 14.7 శాతం పెరిగి రూ.2,03,521 కోట్లకు చేరాయి.
గత ఏడాది సెప్టెంబర్లో రూ. 1,77,173 కోట్లుగా ఉన్న వసూళ్లతో పోలిస్తే ఈసారి గణనీయమైన పెరుగుదల నమోదైంది. వరుసగా మూడో నెలలోనూ జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు దాటడం ఒక రికార్డుగా చెప్పవచ్చు.
నిన్నటితో ముగిసిన సెప్టెంబర్లో కేంద్ర జీఎస్టీ (CGST) ద్వారా రూ.37,762 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ (SGST) ద్వారా రూ.45,363 కోట్లు వచ్చాయి. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ వసూళ్లు (IGST) రూ .1,20,396 కోట్లుగా నమోదయ్యాయి. సెటిల్మెంట్ల తర్వాత నికర జీఎస్టీ ఆదాయం 18.1 శాతం పెరిగి రూ.1,76,520 కోట్లకు చేరింది. దేశీయంగా వసూలైన జీఎస్టీ ఆదాయం కూడా పెరిగింది. సెప్టెంబర్లో ఇది 10.1 శాతం వృద్ధితో రూ.1,37,996 కోట్లకు చేరింది. దిగుమతులపై వసూలైన జీఎస్టీ ఆదాయం పెరగడం మొత్తం వసూళ్ల వృద్ధికి దోహదం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..