ఖైరతాబాద్ ఉపఎన్నిక విషయంలో కీలక పరిణామం..
ఖైరతాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా నిలిపివేయాలని కోరుతూ పీజేఆర్ కుమార్తె, కాంగ్రెస్ నేత విజయారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Khairatabad


హైదరాబాద్, 01 అక్టోబర్ (హి.స.) ఖైరతాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా నిలిపివేయాలని కోరుతూ పీజేఆర్ కుమార్తె, కాంగ్రెస్ నేత విజయారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

2024లో తాను దాఖలు చేసిన పిటిషన్ పై తుది తీర్పు వచ్చే వరకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించే ప్రక్రియను నిలిపివేయాలని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు.

ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్లో ఎన్నికల సంఘం (ఎస్ఈసీ), దానం నాగేందర్ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2023 శాసనసభా ఎన్నికల్లో ఖైరతాబాద్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థిగా పీజేఆర్ కూతురు విజయారెడ్డి పోటీ చేశారు.

ఈ ఎన్నికల్లో విజయారెడ్డి దానం నాగేందర్పై 22,010 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎన్నికల అఫిడవిట్లో దానం తన భార్య, ఆధారపడిన వారి ఆస్తులకు సంబంధించిన కీలక సమాచారాన్ని దాచిపెట్టారని ఆరోపిస్తూ విజయారెడ్డి హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని ప్రకటించి, ఆయన ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ పై విచారణ కోర్టులో పెoడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల అంశంలో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిపై తెలంగాణ హైకోర్టు వేటు వేసింది.

హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతయ్య ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందని పేర్కొంటూ గత శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. త్వరలోనే ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ క్రమంలో విజయారెడ్డి తన పాత పిటిషన్ పై మరోసారి కోర్టును ఆశ్రయించడం.. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణలో ఎలాంటి నిర్ణయం ఉంటుంది అనేది చూడాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande